Srirama Navami Roju oka avineethi katha in Telugu శ్రీరామ నవమి రోజు ఒక అవినీతి కథ ఇన్ తెలుగు…
అవినీతి
ఒక రోజు రామచంద్రుడు నిండుసభలో కొలువై ఉన్నాడు. ఆ సమయంలో ఒక శునకం
లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది. భటులు అడ్డుకున్నారు. అయినా, అది వెనక్కి తగ్గలేదు. ‘నేను రాములవారికే నా సమస్యను విన్నవిస్తాను’ అని భీష్మించుకుంది. దీంతో, సార్వభౌముడి ముందు ప్రవేశపెట్టారు. ‘నన్ను ఓ వ్యక్తి అకారణంగా గాయపరిచాడు. అతణ్ని శిక్షించండి ప్రభూ!’ అని వేడుకుందా శునకం. వెంటనే నిందితుడిని పిలిపించారు. అతను తన తప్పు ఒప్పుకున్నాడు.
Telugu Stories శ్రీరామ నవమి రోజు ఒక అవినీతి కథ ఇన్ తెలుగు
ఓ రోజు తాను ఆకలితో భిక్షాటనకు వెళ్తుంటే, కాలికి అడ్డు తగిలిందనీ, హద్దులు తెలియని కోపంతో అలా ప్రవర్తించాననీ వివరణ ఇచ్చాడు. ‘తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. శిక్ష తప్పదు’ అని తీర్మానించింది సభ. ‘అయితే, ఆ యాచకుణ్ని ఏదైనా ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నతాధికారిగా నియమించండి. ఇదే తగిన శిక్ష అని సూచించింది శునకం. కుక్క మాటకు అందరూ ఆశ్చర్యపోయారు.
‘దీనికో కారణం ఉంది ప్రభూ. పూర్వజన్మలో నేను ఆలయ ఉద్యోగిని. చాలా నిజాయతీగా వ్యవహరించేవాణ్ని. రోజూ గుళ్లో దీపం వెలిగించాక, వృథాగా పోనివ్వడం ఎందుకనే ఉద్దేశంతో, చేతికంటిన చమురును ఒంటికి రాసుకునేవాణ్ని. పిసరంతే కావచ్చు. అవినీతి అవినీతే. దేవుడి సొత్తు తిన్న పాపానికి, ఈ జన్మలో ఇలా పుట్టాను. నిజాయతీపరుడినైన నా పరిస్థితే ఇలా ఉంటే, తన ఉద్వేగాల మీద నియంత్రణలేని ఈ మనిషి ఇంకెన్ని తప్పులు చేస్తాడో! ఇంకెంత పాపం కూడగట్టుకుంటాడో! యమలోకంలో ఎన్ని కఠిన శిక్షలు అనుభవిస్తాడో! నాకు కావలసిందీ అదే…’ అంటూ తన ఆలోచనను వివరించింది శునకం.
నయతి ఇతి నీతిః – మనిషికి దారిదీపమై నిలిచేది నీతి. రావణుడు ఒక దారిలో నడిచాడు. దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు. విభీషణుడు ఇంకో దారిలో నడిచాడు. సజ్జనుడిని ఆశ్రయించాడు. నీతిలేని రీతి పేరే… అవినీతి! పతనానికి అది తొలిమెట్టు.